Tuesday, November 20, 2007

స్నేహం - ప్రేమ...

నిఝంగా ఏ కల్మషమూ లేని స్థితి స్నేహానికి మాత్రమే ఉంది. స్నేహానికి పరాకాష్ట త్యాగం. ఆమధ్య శోభారాజు గారి దగ్గర అన్నమయ్య పాటలు పాడడానికి వెళ్ళినపుడు ఏదో మాటల్లో సందర్భం వచ్చి ఆవిడ అడిగింది. ప్రాణస్నేహితుడు అంటే నిజంగా ప్రాణం వదిలేసేటంత స్నేహితులు ఎవరికైనా ఉన్నారా అని అడిగితే నేను ఠపీమని అవునండీ నాకు ప్రసాద్ అనే ప్రాణస్నేహితుడున్నాడు, నేను తనకోసం తను నాకోసం నిస్సందేహంగా ప్రాణాలొదిలేయగలమని గాఠిగా చెప్పేటప్పటికి ఆవిడ చాలా ఆనందించింది. అంటే ప్రాణాలు సైతం వదిలివేయగలగడమనేది స్నేహంలో మాత్రమే నిరాటంకంగా జరుగుతుంది. కానీ ప్రేమికులు ఒకరికోసమొకరు ప్రాణాలొదిలివేయడమనేది విధిలేని పరిస్థితుల్లో మాత్రమే అంటే బలవంతంగా జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా మరణానికి సిద్ధం కాలేరు అలా కాగలిగారు అంటే అది పూర్తిగా సంతృప్తి చెందిన స్థితి అన్నమాట. ఆ స్థితిని ప్రేమ అనేకంటే స్నేహం అంటేనే అందంగా ఉంటుంది.

ఇక ప్రేమ విషయానికొస్తే, ఒక స్పందన, ప్రతిఫలం, ఒకర్నించి ఒకరు ఆశించడమే ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక ముదుసలిని రోడ్డు దాటిస్తే వచ్చేది ఆనందం. ఆ సందర్భంలో సదరు మనిషి మనల్ని ప్రశంసిస్తేనో, కృతజ్ఞతాపూర్వకంగా మెరిసే కళ్ళతో చూస్తేనో తనమీద, ఆ పనిమీద మన ప్రేమ రెట్టింపవడం ఖాయం. నిజమైన ప్రేమ ప్రతిఫలం కోరదు వంటి మాటలు మనల్ని మనం మోసం చేసుకోడానికే పనికొస్తాయి. అస్సలు ప్రతిఫలం కోరనిది స్నేహం మాత్రమే. పైపనిని బాధ్యతగా భావించినపుడు మాత్రమే మనం అటునుంచి ప్రతిఫలం ఆశించడమనేది జరుగదు. అయితే ఆ బాధ్యతకి ప్రేమ కలిస్తే అందులో ఆర్ద్రత నిండడం ఖాయం.

ప్రేమలో తీయని బాధ ఉంటుంది. కానీ స్నేహంలో తీయదనం మాత్రమే ఉంటుంది.

నిజానికి ప్రేమ అనగానే ఆడామగా కలిసి గుర్తొచ్చేస్తారు. మనకి ఇదో పెద్ద దౌర్భాగ్యమని నా అభిప్రాయం. అలా మోసపోడానికి మన సినిమాలు కూడా ఇతోధికంగా సాయపడుతున్నాయి. దానివల్ల ఏమౌతోందంటే ప్రేమ అంటే నేరుగా శారీరక సంబంధానికి రాచబాట అనే మూసలోకి నేటి యువతరం పడి కొట్టుకుపోతోంది. ఇది ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదు. అలాగే స్నేహం పేరుతో జాగ్రత్తగా మొదలెట్టి తర్వాత్తర్వాత మొత్తం సంబంధాన్ని భ్రష్టు పట్టించడమూ చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎందువల్లంటే చిన్ననాటినుంచీ పిల్లలకి తల్లీదండ్రీ , విలువల గూర్చి చెప్పడంలో విఫలమవ్వడం వల్ల మాత్రమే.

వేటి నిర్వచనాలు వాటికున్నాయి. వాటిని వాటిగానే ఉండనివ్వండి. కలగూరగంప చేయకండి. స్నేహమూ ప్రేమా కవలపిల్లల్లాంటివి. ఒకలా కన్పిస్తాయంతే. పూర్తిగా ఒకే లక్షణాలతోనే ఉండాలనేమీ నియమం మాత్రం లేదు. నా అంతరాత్మతో నేను నిజమైన స్నేహం చేయగలిగితే నేను ఈ ప్రపంచం మొత్తానికీ ఎటువంటి వ్యత్యాసాలూ లేని ప్రేమని నిరాఘాటంగా అందించగలనని నాకు బలంగా అన్పిస్తూంటుంది. ఆచార్య ఆత్రేయ అన్నట్లుగా....

ఇచ్చుటలో ఉన్న హాయీ, వేరెచ్చటనూ లేనే లేదనీ
నిన్నను నాకు తెలిసింది, ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ స్నేహనగరుకే పోతాను పోతాను పోతానూ...

5 comments:

రాధిక said...

good one.

బ్లాగాగ్ని said...

చాలా మంచి టపానండీ. మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తాను.

హృదయ బృందావని said...

naa blog lo mee comment choosaanu.
thnk u very much Kandarpa garu.
alaage paata malli vini tappulu
savaristhaanu.

by the way...mee sneham~prema article baagundi :)

కందర్ప కృష్ణ మోహన్ - said...

కామెంటిన వారందరికీ నెనర్లు.......

Bolloju Baba said...

మీ విశ్లేషణ బాగుంది

బొల్లోజు బాబా